ఒకే రోజున నలుగురు రైతులను ప్రభుత్వం పొట్టన పెట్టుకుందన్న కేటీఆర్
ఇది రైతులను ఆదుకునే సంక్షేమ ప్రభుత్వం కాదని విమర్శ
కాంగ్రెస్ కాదు ఇది ఖూనీకోర్ అని మండిపాటు
భారతీయ వెలుగు ప్రతినిధి హైదరాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వంలో రోజురోజుకు రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో రైతు రాజ్యం లేదని… రైతు వంచన ప్రభుత్వం పాలిస్తోందని మండిపడ్డారు. ఒకే రోజున నలుగురు రైతులను రేవంత్ ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని అన్నారు.
“ఒకే రోజు నలుగురిని పొట్టన పెట్టుకున్న ప్రభుత్వమిది! రైతు రాజ్యం కాదిది… రైతు వంచన కొనసాగిస్తున్న రాజ్యమిది!
ముమ్మాటికీ రైతులను ఆదుకునే సంక్షేమ ప్రభుత్వం కాదిది… తోడేళ్లలా ప్రాణం తీసే క్రూరత్వాన్ని నింపుకున్న ఇందిరమ్మ రాజ్యమిది!
కాంగ్రెస్ కాదు ఇది ఖూనీకోర్
ఆత్మహత్యలు కాదివి ముమ్మాటికి మీరు చేసిన హత్యలు
రుణమాఫీ చేయకుండా తీసిన ప్రాణాలు
రైతుబంధు వేయకుండా చేసిన ఖూనీలు
ఆ కుటుంబాల మనోవేదనలే మీ సర్కారుకు మరణ శాసనం రాస్తాయి. వారి కన్నీళ్లే కపట సర్కార్ ను కూల్చి వేస్తాయి” అని కేటీఆర్ ట్వీట్ చేశారు.