శారదా పీఠం అక్రమ నిర్మాణాల కూల్చివేతకు రంగం సిద్ధం.
భారతీయ వెలుగు తిరుమల, అక్టోబర్ 25: శారదా పీఠం భవనాల కూల్చివేతకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ (AP Govt) ఆదేశాలతో శారదా పీఠం అక్రమ నిర్మాణాలు కూల్చేందుకు టీటీడీ (TTD) నిర్ణయం తీసుకుంది. తిరుమలలో అక్రమ నిర్మాణాలు తొలగించాలని శారదా పీఠానికి టీటీడీ అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు.. తదనంతరం అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను టీటీడీ కూల్చివేయనుంది. టీటీడీ భూముల్లో నిబంధనలను అతిక్రమించి శారదా పీఠం నిర్మాణాలు చేశారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఈవోకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కాగా.. గత కొన్ని సంవత్సరాలుగా తిరుమలలో శారదా పీఠం అక్రమ నిర్మాణాలను చేపట్టింది. దాదాపు 20వేల చదరపు అడుగుల్లో శారదా పీఠం అక్రమ నిర్మాణాలు చేపట్టింది. 2007లో మొదటి సారి అక్రమ నిర్మాణాలను శారదా పీఠం చేపట్టింది. తర్వాత 2019 నుంచి కూడా ఆ నిర్మాణాలను కొనసాగిస్తూనే ఉంది. తిరుమలలో రోడ్డును కూడా ఆక్రమించి శారదా పీఠం మఠం నిర్వాహకులు భారీ భవనాలను నిర్మిస్తున్నారు. చెరువులను ఆక్రమించేసి మరీ నిర్మాణాలు చేపట్టారు. టీటీడీ అధికారుల లెక్కల ప్రకారం దాదాపు 20 వేల చదరపు అడుగుల్లో శారదా పీఠం అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది. గత ఏడాది డిసెంబర్‌లో టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఉన్న పాలకమండలి ఈ అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరిస్తూ రూ.30 లక్షల జరిమానాను విధిస్తూ తీర్మానం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించింది
అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే శారదా పీఠం అక్రమ నిర్మాణాలపై ఈవో సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపించారు. దీన్ని క్షుణ్ణంగా పరిశీలించిన దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి గత పాలకమండలి ఇచ్చిన ధృవీకరణను రద్దు చేసింది. అలాగే శారదా పీఠం చేపట్టిన అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని టీటీడీ ఈవోను దేవాదాయ శాఖ ఆదేశించింది. అయితే ఈ అక్రమ నిర్మాణాలకు సంబంధించిన కేసు కోర్టు పరిధిలో ఉండటంతో ఈ నిర్మాణాలను కూల్చివేసేందుకు ప్రస్తుతం టీటీడీకి కూడా అవకాశం లేకపోవడంతో భవనానికి సంబంధించి ఎక్కడెక్కడ అక్రమ నిర్మాణాలు జరిగిందన్న దానిపై టీటీడీ ఈవో మరికాసేపట్లో అక్కడకు చేరుకుని పరిశీలించే అవకాశం ఉంది. అక్రమ నిర్మాణాలపై తొలి నుంచి తిరుపతి జనసేన అసెంబ్లీ ఇన్‌చార్జ్ కిరణ్ రాయల పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.