ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయకపోవడంపై కోర్టు ధిక్కరణ పిటిషన్
వైద్యారోగ్య శాఖకు హైకోర్టు నోటీసులు
, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ కోర్సుల్లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) నిబంధనల ప్రకారం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పిస్తామంటూ ప్రభుత్వం హైకోర్టుకు ఇచ్చిన హామీ అమలు చేయకపోవడంపై కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావుల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 2024-25 విద్యాసంవత్సరానికి ఎంబీబీఎస్, పీజీ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయాలని గత ఆగస్టులో తాము ఇచ్చిన వినతిపత్రాన్ని పట్టించుకోలేదంటూ ఈ పిటిషన్ వేశామన్నారు. ఎన్‌ఎంసీ నోటిఫికేషన్ ప్రకారం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను 10 శాతం అమలు చేయాల్సి ఉందన్నారు. ఎన్‌ఎంసీ మార్గదర్శకాల ప్రకారం మెడికల్ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పిస్తామని అడ్వొకేట్ జనరల్ హామీ ఇవ్వడంతో హైకోర్టు దీన్ని రికార్డు చేస్తూ ఆ పిటిషన్‌పై విచారణను మూసివేసిందని, అయినా రిజర్వేషన్లను అమలు చేయలేదన్నారు. హైకోర్టు ఉత్తర్వులపై ఈ-మెయిల్ ద్వారా నోటీసులిచ్చినా పట్టించుకోలేదని, కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిన అధికారులను కోర్టు ధిక్కరణ కింద శిక్షించాలని కోరారు. వాదనలను విన్న ధర్మాసనం వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తూ, కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా.సంధ్యకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.