ప్రకృతిని పూజించే గొప్ప పండుగ బతుకమ్మ
సనత్ నగర్( తెలుగు వెలుగు ప్రతినిధి నరేష్ )అక్టోబర్ 5 ప్రకృతిని పూజించే గొప్ప పండుగ బతుకమ్మ అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం నెక్లెస్ రోడ్ లోని బుద్ధ భవన్ వద్ద గల కర్బలా మైదానంలో ఈ నెల 10 వ తేదీన నిర్వహించే బతుకమ్మ పండుగ ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యవేక్షించారు. వేలాదిమంది మహిళలు పాల్గొననున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా బతుకమ్మ పూర్తయ్యే వరకు వాహనదారులు, ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా ట్రాఫిక్ మళ్ళించేలా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. బతుకమ్మ ఆడే ప్రాంతం మొత్తం లైట్లను ఏర్పాటు చేయాలని, విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా బతుకమ్మ లను నిమజ్జనం చేసే హుస్సేన్ సాగర్ లోని బతుకమ్మ ఘాట్ లో కూడా లైట్లను ఏర్పాటు చేయాలని అన్నారు. బతుకమ్మ పాటలతో కూడిన సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలన్నారు. వచ్చిన ప్రజల సౌకర్యార్థం త్రాగునీటి కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. బతుకమ్మ ఆడే ప్రాంతం, బతుకమ్మ ఘాట్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే పండుగ బతుకమ్మ అన్నారు. వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి 9 రోజులపాటు మహిళలు ఎంతో ఘనంగా జరుపుకుంటారని వివరించారు. ప్రతి సంవత్సరం కర్బలా మైదానంలో నిర్వహించే బతుకమ్మ కు వచ్చే మహిళలు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లను చేస్తూ వస్తున్నామని, ఈ సంవత్సరం కూడా అన్ని ఏర్పాట్లను చేయడం జరుగుతుందని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు. ఒక్క తెలంగాణ ప్రాంతానికే పరిమితమైన బతుకమ్మ పండుగ దేశ విదేశాలలో నిర్వహిస్తున్నారని, ఇది మనకెంతో గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో బేగంపేట కార్పొరేటర్ టి.మహేశ్వరి, రాంగోపాల్ పేట మాజీ కార్పొరేటర్ లు అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, అత్తిలి అరుణ గౌడ్, జిహెచ్ఎంసి ఈ సుదర్శన్, వాటర్ వర్క్స్ జిఎం వినోద్, శానిటేషన్ డి ఈ దేవేందర్ రెడ్డి, ఆర్ అండ్ బి డి ఈ మనోహర్ బాబు, ఇరిగేషన్ అధికారి శ్యామ్ సుందర్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ సుష్మిత, స్ట్రీట్ లైట్ డి ఈ ప్రసన్న, లేక్ ఎస్సై కిరణ్, ట్రాఫిక్ సి ఐ ఉప శంకర్, లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్ గౌడ్, బి ఆర్ ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, శ్రీనివాస్ గౌడ్, వెంకటేషన్ రాజు, నాయకులు నాగులు, లక్ష్మీపతి, శ్రీహరి, శేఖర్, కిషోర్, మహేందర్, గజ్జెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.