Breaking News

తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల – అక్టోబర్ 9న నియామక పత్రాల పంపిణీ

16 ఏళ్ల నిరీక్షణకు తెర – 2008 డీఎస్సీ అభ్యర్థులకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు
1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్, దసరాలోపు నియామక పత్రాల పంపిణీ
హైదరాబాద్: తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన జనరల్ ర్యాంక్ లిస్ట్‌ను ప్రకటించారు. డీఎస్సీ నోటిఫికేషన్ మార్చి 1న 11,062 టీచర్ పోస్టుల భర్తీ కోసం విడుదల కాగా, జులై 18 నుండి ఆగస్టు 5 వరకు పరీక్షలు నిర్వహించామని గుర్తుచేశారు. ఈ పరీక్షలకు మొత్తం 2.45 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాలను అధికారులు కేవలం 55 రోజుల్లోనే విడుదల చేశారని సీఎం తెలిపారు.
ఫలితాలను చూసేందుకు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://tgdsc.aptonline.in/tgdsc/ ద్వారా అందుబాటులో ఉంచారు.
ఫలితాల ప్రకటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్ నిర్వహిస్తాం. ఈ ఏడాది దసరా పండగకు ముందుగా, అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను అందజేస్తాం” అని హామీ ఇచ్చారు.
2008 డీఎస్సీ అభ్యర్థులు 16 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారని, వారి నిరీక్షణకు ముగింపు పలుకుతూ కాంట్రాక్ట్ ఉద్యోగాలను కల్పించనున్నట్లు సీఎం ప్రకటించారు.
గత ప్రభుత్వ డీఎస్సీతో పోలిస్తే భారీ నోటిఫికేషన్
“గత ప్రభుత్వం పదేళ్లలో కేవలం 7,000 పోస్టులతో ఒకే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. కానీ మేము టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేసి, 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 29న విడుదల చేశాం,” అని రేవంత్ రెడ్డి అన్నారు.
ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌లో 2,629 స్కూల్ అసిస్టెంట్, 727 భాషా పండితులు, 182 పీఈటీ, 6,508 ఎస్జీటీ, 220 ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 796 ఎస్జీటీ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. మొత్తం 14 జిల్లాల్లో 56 ఎగ్జామ్ సెంటర్‌లను ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు.

కేంద్ర హోంమంత్రి అమీషా రాజీనామా చేయాలి

భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య విషము సేవించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి