రాష్ట్రంలోని ప్రధాన సమస్యలను పక్కన పెట్టి, రూ. లక్షల కోట్లతో మూసీ నది సుందరీకరణ చేపట్టడాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో ప్రజలను బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయిస్తామని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.మూసీ పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం పర్యటన చేపట్టింది. హైదర్‌షా కోటలో హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, మల్లారెడ్డి వంటి నాయకులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నేతల పర్యటన సందర్భంగా స్థానికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయగా, హరీశ్ రావు నేతృత్వంలోని బృందం వారికి భరోసా ఇచ్చింది.
హరీశ్ రావు మాట్లాడుతూ, రాష్ట్ర సమస్యలను పక్కన పెట్టి మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై రూ. 1500 కోట్ల ఖర్చు చేయడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలోని పథకాలకు నిధులు లేవంటూ హామీలు అమలు చేయకుండా, ఇంత భారీగా డీపీఆర్‌కు నిధులు ఎలా కేటాయిస్తారంటూ ప్రశ్నించారు. మూసీకి కేటాయించిన నిధులతో కనీసం వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయలేరా? అంటూ మండిపడ్డారు.గోదావరి నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కాకుండా మరెక్కడి నుంచి తెస్తారో చెప్పాలంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. మూసీ పరీవాహక ప్రజలను బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయించడాన్ని వ్యతిరేకిస్తూ, రియల్ ఎస్టేట్ వ్యాపారిలా వ్యవహరించకూడదని హెచ్చరించారు.