భారతీయ వెలుగు ప్రతినిధి అమరావతి
విజయసాయిరెడ్డి ఆమరణ దీక్ష.. జోక్ కాదు.. నిజమే!
వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్య సభ సభ్యుడు వేణుంబాకం విజయసాయిరెడ్డి ఆమరన నిరాహార దీక్షకు రెడీ అవుతున్నారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా వైరలవుతోంది. మరి దీనికి కారణం ఏంటి? ఎందుకు? అంటే.. విశాఖపట్నంలోని ఆంధ్రుల హక్కుగా ఉన్న స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణ చేయకుండా.. అడ్డుకునేందుకేనని చెబుతున్నారు. దీనికి సంబంధించి ముహూర్తం ఇంకా రెడీ కాలేదని.. అయ్యాక వివరాలు తెలుస్తాయని అంటున్నారు.
అయితే.. అసలు కేంద్రంలోని పెద్దలతో పరిచయాలు ఉండడమే కాకుండా.. రాజ్యసభలోనూ వైసీపీ పక్ష నాయకుడిగా ఉన్న సాయిరెడ్డి.. కేంద్రంతో మాట్లాడి పరిష్కరించేందుకు ప్రయత్నించవచ్చు కదా? అనేది ప్రశ్న. అంతేకాదు.. అసలు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశారన్నది కూడా ఇక్కడ సందేహమే. వైసీపీ ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కు విషయాన్ని పక్కన పెట్టారు. ఏదో నామ్ కే వాస్తే(పేరు కోసం) అన్నట్టుగా లేఖలతో సరిపుచ్చారు.
ఇక, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం దీక్షలు.. చేయడం ఏంటనేది ప్రశ్న. అయితే.. ఇక్కడ ఓ లాజిక్ ఉందన్న మరో చర్చ కూడా నడుస్తోంది. ప్రస్తుతం వైవీ సుబ్బారెడ్డిని తప్పించి.. ఉత్తరాంధ్ర పగ్గాలను సాయిరెడ్డికి అప్పగించారు. దీంతో ఆయన రేపో మాపో పగ్గాలు చేపట్టనున్నారు. విశాఖ నుంచి విజయనగరం వరకు కూడా.. సాయిరెడ్డి హవా సాగనుంది. పార్టీపరంగా ఆయన సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఒక పెద్ద హైప్ తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ దీక్షలు.. నిరాహాలు అంటూ ప్రకటనలు చేస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తుండడం గమనార్హం. ఏదేమైనా ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు సీరియస్‌గా తీసుకోని ఈ విషయాన్ని ఇప్పుడు సీరియస్‌గా తీసుకుంటే.. నవ్వురాదా..? అనేది ప్రశ్న.