భారతీయ వెలుగు ప్రతినిధి విజయవాడ
బెదిరిస్తున్న వైపీఎస్‌లు -అందుకే ఆ కేసులు సీఐడీకి ?
అంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన కేసుల్ని సీఐడీకి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. టీడీపీ ఆఫీసుపై దాడి, చంద్రబాబు నివాసంపై దాడి కేసుతో పాటు జెత్వానీ కేసును కూడా సీఐడీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. మరో కీలక కేసుగా ఉన్న రఘురామకృష్ణరాజుపై హత్యాయత్నం ఘటనలో దర్యాప్తు అధికారిని మార్చింది. ప్రకాశంజిల్లా ఎస్పీకి ఫైల్స్ అప్పగించాలని ప్రస్తుత దర్యాప్తు అధికారిని ఆదేశించింది. దీనికి కారణం ప్రస్తుత దర్యాప్తు అధికారిని వైపీఎస్‌లు బెదిరిస్తూండటంతో ఆయన కటువుగా ఉండంటం లేదని.. ప్రభుత్వానికి సమాచారం తెలియడమే.
టీడీపీ ఆఫీసుపై దాడి, చంద్రబాబు ఇంటిపై దాడుల ఘటనలకు నాటి పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో సహకరించారు. ప్లాన్ అమలులో వారిది కీలక పాత్ర. ఆ వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం దర్యాప్తు అధికారులపై కొంత మంది వైపీఎస్‌లు ప్రత్యక్ష, పరోక్ష బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకే నిందితుల అరెస్టు విషయంలోనూ ఆలస్యం చేశారు. ఇక జెత్వానీ కేసు సంగతి చెప్పాల్సిన పని లేదు. సీనియర్ ఐపీఎస్ అధికారులు ఇందులో ఉన్నారు. వీరు చేసింది చిన్న నేరం కాదు. అత్యంత ఘోరం. ఐపీఎస్ సర్వీసులో ఉండే అర్హతను కోల్పోయినంత నేరం. అందుకే ఆ కేసు దర్యాప్తు అధికారిపై గుక్కుతిప్పుకోలేనంత ఒత్తిడి తెచ్చారు.
ఇక రఘురామ కేసు వ్యవహారంలో చాలా రోజుల పాటు పరారీలో ఉన్న సీఐడీ మాజీ పోలీసు విజయ్ పాల్ విచారణకు వచ్చి దర్యాప్తు అధికారినే దబాయించి పోయారన్న చర్చ జరుగుతోంది. ఎందుకు చెప్పాలి.. ఏమైనా ఉంటే కోర్టులో చెబుతా.. నువ్వేంటి అడిగేది అని దబాయించడం… అతని వెనుక చాలా పెద్ద పోలీసు అధికారులు ఉన్నారన్న భయంతో ఆ దర్యాప్తు అధికారి కఠినంగా వ్యవహరించలేకపోయారు. విషయం తెలిసిన ఉన్నతాధికారులు ప్రకాశం జిల్లా ఎస్పీకి కేసు విచారణ బాధ్యతను అప్పగించారు. మరోసారి విజయ్ పాల్ ను ప్రశ్నించనున్నారు.
గతంలో తప్పుడు పనులు చేసిన వారు ఇప్పుడు తాము చేసిన తప్పుడు పనులపై కఠినంగా వ్యవహరిస్తే భవిష్యత్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బెదిరింపులకు దిగే పరిస్థితి వచ్చిందన్న పరిస్థితి వినిపిస్తోంది. తక్షణం అలాంటి వారందర్నీ కట్టడి చేయకపోతే మరింత రెచ్చిపోతారని చెబుతున్నారు. ఆయా కేసుల్ని సీఐడీకి ఇవ్వడమే కాకుండా వీలైనంత వేగంగా అరెస్టులు చేయాల్సి ఉందన్న వాదన వినిపిస్తోంది.